శాంతి ప్రియ
సహనమంటే సత్య ప్రవక్తలది
సహనమంటే దయార్ధ్ర హృదయులది
సహనమంటే భువనగగనాలది
ఈ సుగుణం పురుషోత్తములకాభరణం
భగ్గుభగ్గున మండిపోతున్న అగ్గి
రవ్వల మధ్య పడక వేసుకుని కూర్చుని
నిప్పుకే సవాలు విసురుతున్న
ఇబ్రాహీమ్ సహనం శ్లాఘనీయం
మల్లెల్లాంటి లేత బుగ్గల బాలుణ్ణి
నడి రేయి కన్న కలలకి ప్రతిగా
మినా మైదానం మధ్యలో గుండె
రాయి చేెసుకుని గొంతు కోసేందుకు
సిద్ధమవుతున్న ఆ తండ్రి సహనానికి జోహార్లు
పితృ వాత్సల్యానికి పరవశించిపోతూ ప్రభువు
ప్రసన్నత కోసం పరితపించిపోతున్న ఆ
పుత్రుని పరమ సహనం నిరుపమానం
ఉక్కు రంపం తన దేహాన్ని
చీల్చుకుంటూ తెగ సాగుతున్నా
శరీరం రెండు ముక్కలయి లెక్క
లేనంత బాధ కలుగుతున్నా కెరటాల్లా
దుఃఖం ఉప్పొంగుతున్నా సహిస్తూ సత్యమే
పలికిన జకరియా సహనం ప్రశంసనీయం
రాళ్ళు రువ్వి నరాల్ని చిట్లగొడుతున్నా మేకులు
దించి నాడుల్ని తెంపేస్తూ నరరూప రాక్షసుల్లా
వికటాట్టహాసం చేస్తూ వేదనకు గురి చేస్తున్నా
తనువు నిండా కరుణ నింపుకుని చల్లని దీవెనతో
మందస్మిత మోముతో మమతల్ని మరిపించే
ఈసా వారి సహనం అమేయం.
ప్రవక్తలే ఒక బీజమైతే మహా ప్రవక్త
ముహమ్మద్ ఒక సంజీవ రూపం
ప్రవక్తలే ఒక మూలమైతే
రసూల్ వారే మహా వృక్ష స్వరూపం
ప్రవక్తలే ఒక నెలవంకైతే
నబీ వారే పూర్ణ చంద్రం
ముహమ్మద్ (స) శాంత రూపులు, ఆయన
ప్రబోధనమే విశ్వ మానవ సౌభ్రాతృత్వం. ఆయన
దేహం సత్య కాంతం. దాని చల్లని
జ్వలనమే విశ్వకోటికి ఆదర్శం
ఎంత మృదువో ఆయన మాట, మరి అది
ఎట్టి గట్టి, కరడు గట్టిన హృదయాన్నయినా
ఇట్టే చీల్చుకుని లేస్తుంది. మృగత్వం మెడను
వంచి మానవత్వాన్ని శాఖాశిఖలతో వర్థిల్లజేస్తుంది
ముహమ్మద్ (స)కు ఉన్న మహత్తు ఏమిటి?
నల్ల శాలువా, తెల్లపాగా, ఎండు రొట్టె
ఆయన మృదు మధుర ప్రబోధనంతోనే ది
గంతములు ప్రచలించలేదా? పరివర్తనం చెందలేదా?
ఏమి ఉన్నదీ మక్కా నగరంలో? ఏ
వేవో ఆచారాలు ఎందరెందరో విగ్రహారాధకులు
కాబా ప్రతిష్టాలయంలో 360 అప్రతిష్ట ప్రతిమలు
అచట పుట్టిన అనాథతోనే అరబ్బు దేశం
ముఖరించలేదా? ధర్మం దశ దిశల వ్యాపించలేదా?
వైమనస్యం నశించి, సౌమనస్యం వెలుగొందలేదా?
భయం భ్రాంతి వైదొలిగి శాంతి తంత్రి నినదించలేదా?
నిశ్చల పరాక్రమమున్న నిర్మ హృదయులు
మహా ప్రవక్త (స) దుర్దాంత ధీరత్వ వీర
మహిమాన్వితులు మహా ప్రవక్త (స) ఏళ్ళ
తరబడి బానిసలుగా దమించిపోతున్న దళిత
జనాల మోక్ష అరుణోదయ కిరణం మహా
ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవక్తోత్తములు.

No comments:
Post a Comment