Wednesday, 26 March 2014

సర్వం నీకే అర్పింతు దేవా!

shanti priya

కటిక పేదల్ని సహాయం చేసే
కడు వినమ్రతతో నిన్ను అర్ధించే
రెండు హస్తాలు దేెవా! మా
ఈ రెండు చేతులు

మసక చీకటిని పారద్రోలే
ఉషః కాంతికి బాట వేసే
నీ ప్రవక్త సుభాషితాల నీడలో
నడిచే రెండు అడుగులు దేవా! మా
ఈ రెండు పాదాలు

నీడలా వెన్నంటి వేధించే
నిరంతర జీవిత సమస్యలను నిర్మలంగా
కరుణామయ రీతిలో పరిష్కరించే
పవిత్ర ఖుర్‌ఆన్‌ మహా ధుని
సుమధుర ధ్వనులు శ్రావ్యానందంగా
ఆలకించే రెండు వీనులు దేవా! మా
ఈ రెండు చెవులు

ఫజ్ర్‌ వేళ నిదుర లేచి
ప్రార్థనలో రుకూ సజ్దాలు చేస్తూ
అమృతవాణి పారాయణం చేస్తూ
నిన్నే తలపోసే, నీ సేవలోనే
నిత్యము తన్మయం చెందే
నీ స్మరణలోనే నిరతం నిను దర్శించే
రెండు నేత్రాలు దేవా! మా
ఈ రెండు కళ్ళు

అదయుల తమస్సుని తొలగించే
సదయుల ఉషఃస్సుని వెలిగించే
నిరతము దివ్య జ్యోతి పారాయణ పారీణత
శ్రవణములోనే పరవశించే
ఎన్నడూ విడవక నిన్నే
ఏక చిత్తంతో సంకీర్తించే
ఒకే హృదయం దేవా! మా
ఈ ఒకే ఒక్క మనసు

కామ క్రోధ, మద లోభాలనూ
మా మది నుండి తొలగించు దేవా!
నీ పవిత్ర నామ, అశేష గుణ వర్ణమున
మేను మరచి ఓలలాడేలా దీవించు దేవా!

మా చేతులకు సంకెళ్ళు వేసినా
మా కాళ్ళకు గొలుసులు కట్టినా
చీకటి చెరసాలలో మమ్మల్ని బంధించినా
స్వచ్ఛమైన, సత్యమైన నీ ధర్మాన్ని
చచ్చినా వదులకోని విధంగా ఆశీర్వదించు దేవా!

No comments:

Post a Comment