Monday, 3 March 2014

కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా


- శాంతి ప్రియ

ధర్మాన్ని ధరత్రిపై యాథాస్థితిలో నెలకొల్పి
విజ్ఞుల కామృత దివ్యావిష్కృతుల విందులిచ్చి
న్యాయంగా సుమనస్కుల పక్షం వహించి
వంశ డాంబికాల దుష్కృత పరంపరలను త్రెంచిన
ఇలలో అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వంటి
శాంతి కాముకి, కరుణ పిపాసి, సాధు స్వభావి
కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా

ఆయన -
తండ్రి చేతి గోరు ముద్దలు ఎరుగరు సరికదా జననా
నంతరం అనతి కాలంలోనే తల్లి ప్రేమకు దూరమయి
ముక్కుపచ్చలారని వయసులోనే తాత ముత్తలిబ్‌ను కోల్పోయి
అబూ తాలిబ్‌ వాత్సల్య నీడలో పెరిగారు ముహమ్మద్‌ (స)

బీదసాదల పాలిట పెన్నిధని ఖ్యాతి
గాంచిన ప్రణుత గుణము గల ప్రవఁరులు
ప్రజల మేలునాశపడు ప్రవక్తోత్తములు
వ్యర్థ వేషాలకు దూరంగా మసలిన మహితాత్ములు
వృద్ధ జీవులు, వితంత స్త్రీలు, అనాథ ప్రజలు
కోరగా రుణాలిచ్చి ఆదుకొను ఆపద్బాంధవులు
పరుల బాధను తన బాధగా ఎంచు పరి
తపించు పరమ శ్రేయోభిలాషి ముహమ్మద్‌ (స)

అతిథులను సత్కరించు సుభక్తాగ్రేసరులు
నిఖిల దుర్గుణాలను నిర్మూలించినారు
సమస్త సద్గుణాలకు శ్రీకారం చుట్టినారు
విద్యతో విజ్ఞతో విశ్వకర్తను గుర్తించమన్నారు
న్యాయాధిపతి నీతి బాటన నడవమన్నారు
సర్వ ప్రాణుల ఎడల సాత్విక కరుణ
గలవారే శాంతిప్రియ యశస్వులన్నారు
సద్గుణమనే శిఖరంపై కూర్చునవారే
విశ్వాస గణంలో భక్తోత్తములన్నారు

దాసులకు మేలైన ధనం ధర్మమన్నారు
ధర్మంకంటే ఘన లాభపాటి ఈ జగాన లేదన్నారు
మనసున కల్మషం ఉంచుకోవద్దన్నారు
పైపై మెరుగులు అసలొద్దన్నారు
పాప పంకిల పరిసలాకెళ్ళొద్దన్నారు
పుణ్యాలు చేసేవారి మనుగడకే ఆపద లేదన్నారు
అహం రహిత ఆచరణే సర్వోన్నతం అన్నారు
శీలం స్త్రీపురుషుల సిసలైన సంపదన్నారు
శీల రహిత సమాజం శాపమన్నారు
 నర రుధిర దాహమధికమై మారణహోమం సాగుతుంటే
సర్వసంగ పరిత్యాగులమంటూ సొమ్ము వమ్ము చేెస్తుంటే
కోరిన వరాలిస్తామంటూ కొంపలు కూల్చుతుంటే
కోపంతో రగిలిపోయిన కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స)
నక్షత్ర విద్య మిథ్య అంటూ, తాయెత్తు తమస్సుకి
తార్కాణమంటూ, క్షుద్ర విన్యాసాలు క్షమార్హం కాదంటూ
సమర శంఖం పూరించి సత్య కేతనం ఎగురవేసిన
ప్రవక్తలందరి నాయకమన్యులు ముహమ్మద్‌ (స) వంటి
సత్యప్రియుడు, ధీర శాంతుడు, ధర్మపరాయణుడు
కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా

అందుకే ఆయనకు ఖుర్‌ఆన్‌ పుష్పాంజలి ఘటిస్తోంది:
''ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్నబియ్యి
యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లూ అలైహి వ సల్లిమూ తస్లీమా''.
(సల్లల్లాహు అలైహి వ ఆలిహి వ సల్లం)

No comments:

Post a Comment