Thursday, 20 November 2014

ఓ లోకమా!



 - శాంతి ప్రియ

నీ ధన ప్రీతి గూర్చి నే పాడలేను
దైవ ఘన కీర్తిని నే వీడలేను 

నేను చూశాను ఐహిక లాలసతో వివేకం 
కోల్పోయిన అవివేకుల్ని
నేను చూశాను కామంతో కళ్ళు
మూసుకుపోయిన నర రూప రాక్షసుల్ని
నేను చూశాను మద్యం మత్తులో జూదం
ఆడుతూ మగువలకు వెల కట్టిన కుబేరుల్ని 

అందుకే-
నీ మాయ మాటలను నే నమ్మలేను
మహా ప్రవక్త మహితోక్తులను నే మరువలేను

నేను చూశాను మత కలహాల్లో మాడి
మసి అయిన మహిళామణుల్ని, పసి పిల్లల్ని
నేను చూశాను నిరంకుశ నమ్రూదులను
మృగరూప నరేంద్రులను, ఫిర్‌ఔన్‌, హామానులను
నేను చూశాను అలగా జనాల అత్యాచారానికి
బలైన అబలలను, నిండు గర్భిణులను
నేను చూశాను నిజంగా త్రిశూల కొనలకు
వ్రేలాడుతున్న మూడు మాసాల పసి కూనలను
నేను చూశాను నిజంగా తుపాకీ తూటాలకు 
తూట్లు పడిన తల్లి హృదయాన్ని,, ఇరాక్‌, ఫలస్తీనాల్ని

అందుకే-
నీ చదరంగానికి నే పావుని కాలేను
మహితాత్ముల బాట నే వదలలేను

నేను చూశాను మూర్తీభవత్‌ దైన్యాన్ని, హైన్యాన్ని
రుద్ధభాష్పాకులిత నయనుడైన వృద్ధ తండ్రిని
నేను చూశాను కన్య కొంగు చాటు కృష్ణుడై
కన్నవారిపై కన్నెర్రజేసిన కసాయి కొడుకుల్ని
నేను చూశాను కనక వ్యామోహంతో కొడుకుల్ని
అమ్మేసుకుంటున్న కట్న పిపాస పిత్రోత్తముల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఏ జ్ఞాని జన్మభూమి
గర్వ స్థితి?

నేను పైన దైవానికి జవాబు చెప్పవలసినవాణ్ణి
క్రింద దాసుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాల్సినవాణ్ణి
అందుకే ఓ లోకమా!
నీ వశీకరణ మంత్రాలకు నే లొంగను
క్షంతవ్యంకాని అలసత్వం నే వహించను
                                        
                                         

ఆగామి యుగాలకాయన ఆదర్శప్రాయుడు



by - సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

జాడ్యం నిండిన మౌఢ్య పాలనలో -
నిజం కరువైన నీలి సమాజంలో
ఒకే ఒక్కడు అయిన వ్యక్తి ఒక
మహా శక్తయి, మానవ నిర్మాతయి
సౌజన్య ప్రదాతయి, సాత్విక దూతయి
సాగర సహనంతో సత్య శంఖాన్ని
పూరించిన ఉదంత మేనాటికీ
స్ఫూర్తినిస్తూనే ఉంటుంది లోకానికి

సత్యాన్ని బోధించిన నూహ్‌ా
నియంతల్ని నిలదీసిన ఇబ్రాహీమ్‌
దళిత జనాల పక్షం వహించిన మూసా
సహనానికి తానే ప్రతీకగా నిలిచిన అయ్యూబ్‌
సమాజ శ్రేయస్సు కోసం శిరస్సు అర్పించిన యహ్యా
ధర్మోన్నతికై ప్రాణాలర్పించిన జకరియ్యా
సమానతను బోధించిన ఈసా
క్షమా గుణం తానై నిలిచిన ముహమ్మద్‌
సహన సంపద శాంతి ప్రేమలకు శాశ్వత వారసులు

ఏ ఘోరం చేశాడు బిలాల్‌?
ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌
మండుటెండల్లో మాడే నల్ల సూరీడు
విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి
మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా
అహద్‌, అహద్‌ అని జపించినందుకా
అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?
ఆ మనీషి సహనం పరీక్షకే పరాకాష్ఠ
అధికారం అడగలేదు ఖబ్బాబ్‌
అపకారం చేయలేదు ఉస్మాన్‌
అన్యాయం తలపెట్టలేదు అమ్మార్‌
అధర్మానికి పాల్పడలేదు యాసిర్‌
అసత్యానికి వత్తాసు పలుకలేదు సుమయ్యా
దమన నీతికి దాసోహమనలేదు ముస్‌ఆబ్‌
స్వామి ద్రోహానికి ఒడిగట్టలేదు ఉమ్మె సలమా

ఎందుకు వారు శిక్ష భరించారు తమ
మూపున ఎందుకు నాటారు మేకులు  తనవున
అజ్ఞాన ముసుగు విప్పినందుకా?
మిథ్యా వాదుల్ని నిలదీసినందుకా?
నిజ దైవం అల్లాయేనని నిగ్గు తేల్చినందుకా?
వీడని మిస్టరీ హిస్టరీని ఛేదించినందుకా?
ఏమి తెలుసీ ముష్కరులకు, ముష్రికులకా
మహా ప్రవక్త మహోపదేశం? చిందే
రక్తం, అయ్యే గాయం చేసే ఆర్తనాదం -
''అల్లాహుమ్మహ్‌ాది ఖౌమీ ఫయిన్నహుమ్‌ లా
యాలమూన్‌'' -ప్రభూ! నా జాతి జనులకు
సన్మార్గ భాగ్యం ప్రసాదించు. వారు నన్ను,
నిన్నూ గ్రహించలేని వట్టి అమాయకులు స్వామీ!!

ఆర్ద్రంగా ఉంటూనే రుద్రంగా
ధీరంగా ఉంటూనే దుర్గంగా
సంకల్ప వజ్రం ధరియించి
కారుణ్య వర్షం కురిపించి
అభిగమించు సమ చిత్తుడు
ఆగామి యుగాల కాయన
ఆదర్శప్రాయుడు.

Wednesday, 18 June 2014

మస్తిష్క సముద్రం


ముహమ్మద్ ఖాన్ (గన్న వరం) 

స్తబ్ధంగా ఉన్నది ఏదైనా
ప్రాణి ఎలా అనిపించుకుంటుంది?
చలనం, జలమునకైనా అనివార్యం!

చిరు తటాకమునకైనా
చిన్నారి అలల కేరింతలే చలనం

సరస్సయినా, నదయినా
అలలే కదా చలనం

కెరటాలు లేని సముద్రం ఏది?
అది, సమద్రమెలా అనిపించుకుంటుంది?

నిత్యం సంఘర్షణ
తీరంలోనే, కెరటంలోనే విభేదం
ఏ ఒక్క కెరటమన్నా
మౌనంగా తీరం తాకిందా?
ఏ ఒక్క కెరటమయినా
స్తబ్ధంగా ప్రక్కకు తప్పుకున్నదా?
మస్తిష్కంలో
ఏదో ఒక ఆలోచన
కెరటమై ఎగసిపడనిదే
అది
మస్తిష్కం ఎలా అనిపించుకుంటుంది?
మస్తిష్కం
మహా సముద్ర ఘోష
కెరటాలు
కోకొల్లలు ఉద్భవించటం
ప్రవహించటం
కొన్ని తీరం తాకకనే మరుగైపోవటం
మరి కొన్ని
సుడులయి, అల్ప పీడనములయి
అతలాకుతలం చేయటం
సునామీలై విరుచుకు పడటం
ప్రకృతి వైపరీత్యమై చెలరేగటం
ఇదేం క్రొత్త కాదు కదా!

మహా సముద్రముకన్నా
మస్తిష్క సముద్రం అంతులేనిది
ముకుళించుకుపోయిన మస్తిష్కానికి ఇది
ఎలా అర్థమవుతుంది?


మానవ జన్మ చరితార్థం అవ్వాలంటే..?



శాంతి ప్రియ

సత్య వ్రియుల బలం వెరగాలి
అక్రమార్కుల అహం అణగాలి
శాంతి కాముకుల శ్రమ ఫలించాలి
కాంతి విద్రోహుల మదం తుంచాలి

స్వర్గం మన సొంతమవ్వాలంటే
సత్యార్తి రగలాలి, ధర్మ స్థాపన జరగాలి
నీలో నాలో మనందరిలో
స్నేహ వల్లి వెల్లి విరియాలి

కుట్రలు కుతంత్రాల పన్నొద్దు ఏ కులం వేరుతో
దమన నీతి, దహన కాండలు జరుపొద్దు మతం వేరుతో
నిఖిల జీవులంతా దైవ కుటుంబీకులనీ, దాసులనీ
పరస్పరం సోదరులుగా మసలుకోవాలనీ
మహాప్రవక్త ముహమ్మద్‌ =(లి) బోధించిన ప్రవచనాలు
ఇహపరాల సాఫ¦ల్య సాధనాలు మానవతను
వెలిగించే మణి దీపాలు హృదయ గీతాలు

ఎదుటివారిని ద్వేషించమని
ఏ బుద్ధుడూ బోధించడు
ఇరుకు బుద్ధులు వెంచుకోమని
ఏ రాముడూ ప్రవచించడు
అందరు శుభాత్మల సందేశం
ఏకేశ్వరోపాసనం, లోక కళ్యాణం
ఆ మాటయే దైవదర్శన భాగ్యాన్ని
అందించే సోపానం

తుపాకి తూటాలు, బాంబు వేలుళ్ళతో
నర రుధిరమే సాగించమని ఏ ఈసా చెప్పడు
జన ధన ప్రాణాలు, ప్రాణాధికమైన మానాలకు
నష్టం కలిగించమని ఏ మూసా అనడు
స్వార్థం కోసం సలివే ప్రార్థన వ్యర్థం
దైవ ప్రసన్నత విపాసతో సత్కార్యాలు
చేసే నరోత్తముల జీవితం చరితార్థం.

Wednesday, 26 March 2014

సర్వం నీకే అర్పింతు దేవా!

shanti priya

కటిక పేదల్ని సహాయం చేసే
కడు వినమ్రతతో నిన్ను అర్ధించే
రెండు హస్తాలు దేెవా! మా
ఈ రెండు చేతులు

మసక చీకటిని పారద్రోలే
ఉషః కాంతికి బాట వేసే
నీ ప్రవక్త సుభాషితాల నీడలో
నడిచే రెండు అడుగులు దేవా! మా
ఈ రెండు పాదాలు

నీడలా వెన్నంటి వేధించే
నిరంతర జీవిత సమస్యలను నిర్మలంగా
కరుణామయ రీతిలో పరిష్కరించే
పవిత్ర ఖుర్‌ఆన్‌ మహా ధుని
సుమధుర ధ్వనులు శ్రావ్యానందంగా
ఆలకించే రెండు వీనులు దేవా! మా
ఈ రెండు చెవులు

ఫజ్ర్‌ వేళ నిదుర లేచి
ప్రార్థనలో రుకూ సజ్దాలు చేస్తూ
అమృతవాణి పారాయణం చేస్తూ
నిన్నే తలపోసే, నీ సేవలోనే
నిత్యము తన్మయం చెందే
నీ స్మరణలోనే నిరతం నిను దర్శించే
రెండు నేత్రాలు దేవా! మా
ఈ రెండు కళ్ళు

అదయుల తమస్సుని తొలగించే
సదయుల ఉషఃస్సుని వెలిగించే
నిరతము దివ్య జ్యోతి పారాయణ పారీణత
శ్రవణములోనే పరవశించే
ఎన్నడూ విడవక నిన్నే
ఏక చిత్తంతో సంకీర్తించే
ఒకే హృదయం దేవా! మా
ఈ ఒకే ఒక్క మనసు

కామ క్రోధ, మద లోభాలనూ
మా మది నుండి తొలగించు దేవా!
నీ పవిత్ర నామ, అశేష గుణ వర్ణమున
మేను మరచి ఓలలాడేలా దీవించు దేవా!

మా చేతులకు సంకెళ్ళు వేసినా
మా కాళ్ళకు గొలుసులు కట్టినా
చీకటి చెరసాలలో మమ్మల్ని బంధించినా
స్వచ్ఛమైన, సత్యమైన నీ ధర్మాన్ని
చచ్చినా వదులకోని విధంగా ఆశీర్వదించు దేవా!

మాన్యుడవు అసామాన్యుడవు

shanti priya

లోక కళ్యాణార్థం వేల సంఖ్యలో
వచ్చిన ప్రవక్తల వలె ఆవిర్భవించె
మళ్ళీ ఒక కరుణ కలువ
విరబూసింది మానవ వసంతాన

ఆయన దేశకాలాలకు పరిమితమైన
ప్రవక్త కాదు, వినిర్మల హృదయ
విశ్వనాయకుడు అచ్చమైన
అక్షరాల అంతిమ దైవ ప్రవక్త 

ఆయన పలుకులలో తేనెలొలికెను
అంతః కుహరాల తమస్సులు తొలిగెను
తపశ్శక్తులై ఉషస్జ్యోతులై వెలిగెను
మతుల మైల కడిగి మానవత్వం
నాటెను ఆయన దయా దృష్టి వీక్షణల
దివ్యత్వము కాపురముండెను

రుధిర విపాస వెర్రి తలలు వేసిన
మృగ సమాజ మతోన్మాదులు ఆయన
పలుకుల స్వాతిముత్య చినుకుల తాకిడిచె
మానవ ముత్యాలైపోయిరి

బహు విచిత్రమాయన హితోక్తి
వినగానే ధరావతులు ధనాన్వితులు
దళిత నిరువేదల్ని గుండెలకు హత్తుకొనిరి
'సయ్యిదీ' అంటూ గౌరవించిరి

గుండెకాయని నమిలి మింగలేక
ఉమ్మేసినట్టి వారిని చేరదీసి నిజం
ఇదని నచ్చజెవ్పి మెలమెల్లగా మనిషిగా
మలచిన నీవు ముమ్మాటికీ మహా మనీషివే!

కర్కశ హృదయాల్లో కరుణ రసాల్ని పండించి
కుఫ్ర్‌ కారడవిని ఈమాన్‌ కాంతి వనంగా
మలచి మమతల ముత్యాలు జల్లిన
నీవు నిస్సందేహంగా జగద్గురువువే

నెత్తురు వొడిన నేలలో నీతి
అత్తరులను చిల్కించితివె
సతులు చితికి ఆహుతయ్యే భూమిలో
తల్లి పాదాల చెంత స్వర్గమంటివె

ఈ జగాన జీవించిన నీవు
మాన్యుడవు అసామాన్యుడవు
భౌతిక జీవితం పరలోక పంట
పొలం అన్న  మహిమాన్వితుడవు

మనిషికీి - అభిమతానికి మధ్య జరిగిన
భీకర పోరులో కులానికి కాదు
గుణానికే దిగ్విజయమ్మని

చాటిన ధర్మప్రభాకరుడవు 

Wednesday, 19 March 2014

నీకు సాటి నీవేలే


శాంతి ప్రియ

మూఢ నమ్మకాలు నెత్తికెక్కక
అంధ విశ్వాసాలు మేధకందక
నిస్సహాయులై నరులు నిట్టూ
ర్పులు వదిలిన వేళ

నలుపు తెలుపు రంగులలో నరులకు
వెలకట్టి చతుర్వర్ణ తక్కెడలో
మతుల విలువ తూచి అఖిలావని
ఆడపడుచుల అవమానించిన వేళ

స్వేచ్ఛా శంఖం పూరించి కరుణ
కలువలు పూయించి దానవత్వం
మెడలు వంచి మానవత్వం గెలిపించి
శాంతి తంత్రి నినదించి
నీరాజలందుకున్నావు

సత్య సస్య పోరులో
శాంతి ప్రియ జోరులో
ప్రేమ పంచని యోగమెందుకు
మోక్షం ఎరుగని మతం ఎందుకు
మనిషికి మార్గం చూపు నీ ఒక్క
ప్రవచనం పదివేలు

తెల్ల నల్ల తేడాలు లేవని
కుల గోత్ర తిబాదస్తాలు తగవని
వంశ డాంబీకాలు చెల్లవని
మతం మత్తుకీ హితం వెలుగుకీ
గల పొత్తును చూపితివే

మానవ జాతినే మేల్కొల్పావో
సత్య సుగంధాలే వెధజల్లావో
శాంతి పూలే చల్లావో
కరుణ కమలాలే నాటావో
మాటలా అవి? కావు నడిచే
స్వర్గ బాటలు హృదయ గీతికలు
ఇంత పదునా ప్రవక్తల ప్రబోధనాలకు
ఇంత విలువా వారి హితవులకు
పలుకులా? అవి కావు
దివ్యావిష్కృతి వెలుగులే

మనిషి చేరని ప్రజ్ఞ  మీది
మాట కందని విజ్ఞత మీది
దివ్యవాణులు మీ మనో
సీమల్లో నర్తించినవే

తింటివెన్నో రాళ్ళ దెబ్బలు
వింటివెన్నో కరకు మాటలు
నిప్పు కుంపటిలో నిన్ను నెట్టిన
నీతిహీనులను దీవించితివే

సత్యాస్పర్శనం లేని
ప్రవచనం పరిమళరహితం
ప్రవక్తాదర్శం లేని
ప్రపంచం ప్రగతిరాహిత్యం

నరభోక్తలు మానవతను నంజుకు
తింటున్న భయోదయ వేళలో
మిథ్యాశక్తులు సత్యాసక్తులపై విరుచుకు

పడ్డ తమో సంధ్య వేళలో
మెరిసావు ఒక ఆశా కిరణమై
వెలిగావు ఒక శాంతి దీపమై

కళ్ళు మూసుకుపోయిన కామాందులూ
ఒంటి పోతల రాబందులూ
దయ ఎరుగని దురంధరులూ
నిద్దురెరుగరు జన్మలో నీ
శాస్త్ర చికిత్స మోత వింటే

వాదులాడే వితండవాదులు
మార్గం ఎరుగని మార్గభ్రష్టులు
నిజం నమ్మని నీచ మానవులు
పవిత్రులవక ఉందురా నీ
ఆదర్శాలే కంటే

గిరి అంతటి వివేకాన్ని
పద గరిటిలో అందించిన
నీవు నాటికీ నేటికీ
ఏనాటికీ నీకు సాటి
నీవేలే నీకు పోటీ లేదులే