Wednesday, 5 March 2014

దైవ తీర్పు


సయ్యిద్ అబ్దుస్సలాం ఉమ్రి 

వాస్తవాన్ని వక్రీకరించి
అసత్యాన్ని ప్రచారంలో ముంచి
తౌహీద్‌ తత్వాన్ని కత్తిరించి
షిర్క్‌ సడిని ఆపాదించి
మోడులా మిడిసి పడే
ముష్రిక్కు గుండె శిశిరానికి
            'అస్ఫలుస్సాఫిలీన్‌' దైవ తీర్పు
చర్మ చక్షువులకు వెర్రి ఆకర్షణల రంగులు అద్ది
ఆత్మ చక్షువులకు కర్రి మబ్బుల గంతలు కట్టి
జన జీవనాన్ని పాప పంకిలంలో నెట్టి
జన స్రవంతిలో నాస్తకత్వాన్ని ప్రవేశ పెట్టి
పండిత పామరుల్ని తప్పు త్రోవ పట్టించే
దగుల్బాజీ నిశీథ పిపాసులకు
           'నిప్పు కత్తెరలు' దైవ తీర్పు
పంచేద్రియాలను మిథ్యావాదంతో వంచించి
జ్ఞానేంద్రియాలను చీకటి చెరసాల్లో బంధించి
మౌఢ్యాన్ని నరనరాల్లో దట్టించి
పెల్లుబుకే పాప భీతిని, పరలోక ప్రీతిని
నీరు గార్చే నీతి హీనులకు
         'సలసల మరిగే చీము' దైవ తీర్పు
నిజమంటే జడుసుకుని
సత్యమంటే తోక ముడుచుకుని
మిథ్యా నీలి పొగలను
పట్టుకు వ్రేలాడే పూర్ణ అవిశ్వాసులకు
           'నిప్పు భక్షణం' దైవ తీర్పు
షిర్క్‌ నుండి తౌహీదుకి
చీకటి నుండి ప్రభావానికి
నిరాశ నుండి ఆశాసౌధానికి
అశ్రు జలధి నుండి ఆనంద తీరానికి
నరకం నుండి ఫిర్‌దౌస్‌ శిఖరానికి
          నడిపించే మార్పు
          దివ్యావిష్కృతి తీర్పు

No comments:

Post a Comment