Wednesday, 19 March 2014

నీకు సాటి నీవేలే


శాంతి ప్రియ

మూఢ నమ్మకాలు నెత్తికెక్కక
అంధ విశ్వాసాలు మేధకందక
నిస్సహాయులై నరులు నిట్టూ
ర్పులు వదిలిన వేళ

నలుపు తెలుపు రంగులలో నరులకు
వెలకట్టి చతుర్వర్ణ తక్కెడలో
మతుల విలువ తూచి అఖిలావని
ఆడపడుచుల అవమానించిన వేళ

స్వేచ్ఛా శంఖం పూరించి కరుణ
కలువలు పూయించి దానవత్వం
మెడలు వంచి మానవత్వం గెలిపించి
శాంతి తంత్రి నినదించి
నీరాజలందుకున్నావు

సత్య సస్య పోరులో
శాంతి ప్రియ జోరులో
ప్రేమ పంచని యోగమెందుకు
మోక్షం ఎరుగని మతం ఎందుకు
మనిషికి మార్గం చూపు నీ ఒక్క
ప్రవచనం పదివేలు

తెల్ల నల్ల తేడాలు లేవని
కుల గోత్ర తిబాదస్తాలు తగవని
వంశ డాంబీకాలు చెల్లవని
మతం మత్తుకీ హితం వెలుగుకీ
గల పొత్తును చూపితివే

మానవ జాతినే మేల్కొల్పావో
సత్య సుగంధాలే వెధజల్లావో
శాంతి పూలే చల్లావో
కరుణ కమలాలే నాటావో
మాటలా అవి? కావు నడిచే
స్వర్గ బాటలు హృదయ గీతికలు
ఇంత పదునా ప్రవక్తల ప్రబోధనాలకు
ఇంత విలువా వారి హితవులకు
పలుకులా? అవి కావు
దివ్యావిష్కృతి వెలుగులే

మనిషి చేరని ప్రజ్ఞ  మీది
మాట కందని విజ్ఞత మీది
దివ్యవాణులు మీ మనో
సీమల్లో నర్తించినవే

తింటివెన్నో రాళ్ళ దెబ్బలు
వింటివెన్నో కరకు మాటలు
నిప్పు కుంపటిలో నిన్ను నెట్టిన
నీతిహీనులను దీవించితివే

సత్యాస్పర్శనం లేని
ప్రవచనం పరిమళరహితం
ప్రవక్తాదర్శం లేని
ప్రపంచం ప్రగతిరాహిత్యం

నరభోక్తలు మానవతను నంజుకు
తింటున్న భయోదయ వేళలో
మిథ్యాశక్తులు సత్యాసక్తులపై విరుచుకు

పడ్డ తమో సంధ్య వేళలో
మెరిసావు ఒక ఆశా కిరణమై
వెలిగావు ఒక శాంతి దీపమై

కళ్ళు మూసుకుపోయిన కామాందులూ
ఒంటి పోతల రాబందులూ
దయ ఎరుగని దురంధరులూ
నిద్దురెరుగరు జన్మలో నీ
శాస్త్ర చికిత్స మోత వింటే

వాదులాడే వితండవాదులు
మార్గం ఎరుగని మార్గభ్రష్టులు
నిజం నమ్మని నీచ మానవులు
పవిత్రులవక ఉందురా నీ
ఆదర్శాలే కంటే

గిరి అంతటి వివేకాన్ని
పద గరిటిలో అందించిన
నీవు నాటికీ నేటికీ
ఏనాటికీ నీకు సాటి
నీవేలే నీకు పోటీ లేదులే

No comments:

Post a Comment