అబుల్ హసన్
ఇది మక్కా నగరము ఇది బక్కా పట్టణము
ఇది సమస్త మానవాళి మార్గదర్శక కేంద్రము
ఇచట ఆది మానవుడు ఆదం హవ్వాను కలిసెను
మానవ ప్రగతికి గట్టి పునాదులు వేసెను
ఇచట ఇబ్రాహీమ్ తన ఆలుబిడ్డలను తీసు
కొచ్చి కాబా ఒడిలో వదలి వెళ్ళెను
ఇచట తండ్రీకొడుకులు దైవ గృహాన్ని నిర్మించెను
ఇచట ఇస్మాయీల్ ప్రాణ త్యాగానికి సిద్ధమాయెను
ఇచట మూసా ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త (స)
ధర్మశాస్త్రమ్ము కలిసిపోయి పరిపూర్ణమాయెను
రావోయి సోదరా రమ్ము ప్రియతమ్ముడా ఆఫ్రికా
నుండి, అమెరికా నుండి, ఆసియా నుండి, ఆస్ట్రేలియా నుండి
ఫ్లయిటు ఎక్కి, బస్సు ఎక్కి, ఓడ ఎక్కి, ఒంటె ఎక్కి పొమ్ము
సుమనోహర సుందర కాంతిమయము శాంతి
నిలయము కాబా ప్రాంగణము
మల్ల్లె పూ రంగుల మేలిమి వస్త్రాలతో మోక
రిల్లు జనం కన్పడ ఖంగుతినకు విశ్వాస గణమది
తేనెలొలికించు పద సప్త రాగమాలలు విన్పడ
తెల్లబోకు లబ్బయిక్ అల్లాహుమ్మ నినాదమది
దైవ ప్రేమామృతాలు గుండెల్లో నిండగా
దర్శించుము అతీఖ్ ప్రతిష్ఠాలయము
అప్పుడు కనవయ్యా దివ్య ప్రదక్షిణ పరిమళాల
జల్లు కాబా గృహ ముగ్ద మనోహర దృశ్యము
అటు నుంచి హజ్రె అస్వద్‌ను ముద్దాడవోయి
అది స్వర్గ సీమ నుండి రాలిన తునకవోయి
తవాఫ్ పూర్తి చేసి విశ్రాంతికై సాగి
పొమ్ము జమ్ జమ్ బావి గట్టు మీద
అచట నిలబడి కనుము జమ్ జమ
జలం సేవించు విశ్వాస సమూహమ్మును
అటుపిమ్మట సఫా పర్వతమ్ము ఎక్కా
లోయి అది హాజిరా సాధనకు చిహ్నమోయి
శిరోముండనం లేదా వెంట్రుకలు కత్తిరించ
వోయి, అది చెడు విసర్జనకు గురుతువోయి
మక్కా నగరము నీదే సుమా! నీవు
పరాయివాడవనుకోకు కలలోనైనా
రహ్మాన్ అతిథివి అల్లాహ్‌ా రాయబారివి
ఆయన పిలవగ వచ్చిన సౌభాగ్యుడివి
తఖ్వాయే నీ ఆభరణము దైవ స్తుతియే నీకు ఆహారము
సహనమే నీకు సౌందర్యము స్వర్గమే నీ నివాసము
కాబా ఇచ్చే సందేశము -
వేషం వేరైనా, భాష వేెరైనా
రంగులు వేరైనా, సంస్కృతులు వేరైనా విశ్వమంతా
విశ్వకర్త దాసులు జగమంతా ఒకే కుటుంబ సభ్యులు

No comments:
Post a Comment