Wednesday, 12 March 2014

ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో...


- అబుల్ హసన్

ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో...
ఈ ప్రతిష్ఠ ఆరాధనాలయంలో
ఎన్ని దివ్యావిష్కృతులు ప్రసరించినాయో
ఈ పవిత్ర కాబా గృహంలో
ఎన్ని తమస్సులు తొలగినాయో

ఈ మక్కా నగర వీధుల్లో
ఎన్ని సత్య స్కృతులు చల్లబడినాయో
ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో
ఎన్ని లబ్బయిక్‌ నినాదాలు విన్పించినాయో

ఈ నిర్జీవ నల్ల రాతి లోయలో
ఎన్ని వాస్తవాలు ఆవిష్కరించబడినాయో
ఈ బంజరు బీడువారిన అవనిలో
ఎన్ని మానవ రాసి ముత్యాలు దాగినాయో

ఈ అరఫా మైదానం విడిదిలో
ఎన్ని పాపాలు కడగబడినాయో
ఈ మినా మైదాన మట్టిలో
ఎన్ని త్యాగాలు ప్రతిఫలించినాయో

ఈ రమీ జమరాత్‌ల పోరులో
ఎన్ని దుష్ట శక్తులు తరమబడినాయో
ఈ శిరోముండన మేళలో
ఎన్ని దౌష్ట్యాలు పరిత్యజించబడినాయో

ఈ మార్గదర్శక కేంద్రావనిలో
ఎన్ని సమతా రాగాలు ఆలాపించబడినాయో
ఈ సఫా మర్వాల సయీలో
ఎన్ని మాతృ ప్రేమలు ఇంకి ఉన్నాయో
ఈ అతీఖ్‌ గృహ తవాఫ్‌లో
ఎన్ని జీవితాలు ధన్యమయినాయో

ఈ కాంతి శిఖర గుహలో
ఎన్ని దివ్య కాంతులు ప్రకాశించినాయో
ఈ సౌర్‌ గుహ ఒడిలో
ఎన్ని స్నేహ సౌరభాలు గుభాళించినాయో

అందుకే -
ఈ కాబా విశ్వ మార్గదర్శక కేంద్రం అయింది
అందుకే -
ఈ నిఖిల జగతికి నీతి శాస్త్రాన్ని అందించింది.

No comments:

Post a Comment