- అబుల్ హసన్
తూరుపు సంద్య ఎరుపు అది జీవితపు మరో మలుపు
పడమటి సంద్య ఎరుపు అది పరలోక జీవితానికి విడుపు
''అద్దున్యా మజ్రవుల్ ఆఖిరా
మా తజ్‌రా తహ్‌ాస్వుదు''
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు
కాటి మట్టిలో కల్పేంత వరకు విధి ఒప్పదు
ఇదేం వింతో గాని జీవితం ఓ మంచు బిందువు
అది ఏదో ఒకనాడు రాలిపోక మానదు
''కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్ఖా
వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్''
మరణ దూత వాకిల్లో వచ్చి వాలాక
ఏ కోకిలా నీ కోసం పాడదు
ఏ అనందాశ్రువూ నీ కోసం నర్తించదు
ఏ శబ్ధమూ అర్థమై విన్పించదు
ఏ హస్తమూ అభయమై దీవించదు
ఏ క్షణమూ ఆలస్యం అవ్వదు
''ఇజా జాఅ అజలుహా లా యస్‌తాఖిరూన
సాఅతఁవ్ వలా యస్‌తఖ్దిమూన్''
అస్తమించడానికే ఉదయిస్తాడు సూర్యుడు
వాడిపోవడానికే పూస్తాయు పూలు
నేలకొరగడానికే లేస్తాయి అలలు
చావడానికే పుడతారు ప్రజలు
''కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్; వ ఇన్నమా
తువప్ఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్‌ా''
పుష్పాలు పోతేగానీ ఫలములు రావు
నక్షత్రాలు మాయమైతేగానీ సూర్యుడు రాడు
శిశిరం మరణిస్తేగానీ వసంతం రాదు
శ్వాస ఆగితేగానీ సత్యం తెలవదు
''వ మల్ హయాతుద్దున్యా
ఇల్లా మతావుల్ గురూర్''
జీవిత మాధుర్యం చవి చూడాలంటే - హృదయం
దైవ సంస్మరణ స్వాతి చినుకుల్లో తడవాలి; కామ,
క్రోధ, మోహ, మద, మత్సర్యాలను జయించాలి
లేదంటే జీవితం నిరర్థకం అవుతుంది
మనిషి నివాసం నరకం అవుతుంది
''ఫమన్ జుహ్‌ాజిహా అనిన్నారి వ
ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్''

No comments:
Post a Comment