- ముహమ్మద్ గన్నవరం
ఆలోచనను
అక్షరంగా మలిచే క్రమములో
నా కలం, చిత్రకారుని కుంచెలా
ఎల్లప్పుడూ, గాయపడుతూనే ఉంటుంది.
ఒక చక్కటి ఊహను
కుంచెకు అద్ది, ఆ రూపాన్ని రంగుల్లో నాన్చి
కాగితంపై చిత్రించే థలో
చిత్రకారుడు
బహు చిత్రంగా ఓడిపోవడం గెలవడం
మనం, కనులార్పకుండా చూస్తుండిపోతాము
ఏదో ఒక అపస్వరం
వీణను చుట్టముట్టి బాధిస్తున్నట్లు
గేయం, గాయమై రోదిస్తుందా అన్నట్లు
ఆ చిత్ర ప్రయత్నాన్ని
ఊహించని మలుపు ఏదో ఛిన్నాభిన్నం చేస్తుంది
చిత్రకారుడు
అంతుపట్టని ఆవేదనతో
తన వంక, అసంపూర్తిగా ఎదుట నిలిచిన చిత్రం వంక శూన్యంలో తప్పిపోతాడు.
అక్షరం అనంతమై విస్తరించేందుకు
ఆకాశమయి పుష్పించేందుకు
చీకట్లలో మిణుగురు వెలుతురులా
ఒక మెరుపు మస్తిష్కాన్ని వెలిగించి తప్పుకుంటుంది
కవిత కలం నీడలో చిగురిస్తుంది, చిత్రంగా!

No comments:
Post a Comment