Monday, 3 March 2014

పసివాడి ప్రార్థన


- హఫీజుల్లాహ్‌

అనుక్షణం కాబా నా కళ్ళెదుటుండాలి
అనునిత్యం దైవ నామం నా మదిన మెదులుతుండాలి
ప్రతి నిమిషం నా వీనులు ఖుర్‌ఆన్‌ వింటుండాలి
ప్రతి ఘడియ నా అధరాలు సల్లి అలా అంటుండాలి

గోరు ముద్దలూ వద్దు, జోల పాటలూ నాకొద్దు
మణులూ వద్దు, మాణిక్యాలూ నాకొద్దు
నీ అతీఖ్‌ గృహ దర్శనమే నాకు ముద్దు
అదే అదే నా కోరికల సరిహద్దు

అమ్మకు మించిన వరం లేదని
ఆమె పాదాల చెంత స్వర్గం ఉందని
పలికిన ప్రియ ప్రవక్త జన్మస్థలం మక్కా
విశ్వ జనులందరి పాలిట మార్గ
దర్శక కేంద్రం మక్కా

కనులు ప్రసాదించిన ఓ కరుణా నిధీ!
కాబా దర్శన భాగ్యం కలిగించు
వీనులు అనుగ్రహించిన ఓ విశ్వ పాలకా!
మక్కా అజాన్‌ వినే అదృష్టం కల్పించు
చేతులు ప్రసాదించిన ఓ దయాకరా!
కాబా పరదాను స్పృశించే భాగ్యాననుగ్రహించు
                                     (ఆమీన్‌!)




No comments:

Post a Comment