Tuesday, 4 March 2014

ఇస్తిగ్ఫార్‌


ముహమ్మద్ గన్నవరం

అహం హద్దు మీరి
'హింస' వైట్‌ హౌస్‌ ప్రతిరూపంగా మారి
చరిత్ర పుటల్ని రక్తంతో లిఖించినపుడు
ఆ ఎర్రటి అక్షరాల పరావర్తనపు వెలుగుల్లో
ముసల్మానుల మూకుమ్మడి సమాధుల్లో
నీ అందమైన దురహంకార శ్వేత రూపాన్ని
చూసుకుందువుగాని రా!
పుర్రెల గుట్టల్ని - అస్తిపంజరాలతో నిండిన
ఖబరస్తాన్‌లో, మొలుస్తున్న షహీదీల త్యాగాల్ని
తొక్కుకుంటూ రా!
'ఇన్నాలిల్లాహి వ యిన్నా ఇలైహి రాజివూన్‌'
మరో హిట్లర్‌ రూపమెత్తి
ఈ నిశ్శబ్ద శ్మశానాన్ని ఏలుకుందువుగాని రా!

ఒక్క కన్నీటి బొట్టును ఈదేందుకు
ఎన్నెన్ని
తెరచాపలెత్తిన పడవలు కావాలో...
ఒక్క క్షణం ఊహించు
ఒక్కగానొక్క దుఖ్ఖః పొరను దాటేందుకు
ఎన్నెన్ని
చీకటి పొరలలో కాలం పొదిగిన
వెలుగు రేఖలు ప్రసరించాలో...!? ఆలోచించు.

ఒకే ఒక్క కన్నీటి బొట్టు లోతెంతో? అందులో...
ఎన్నెన్ని
జీవితాల వ్యధలు గడ్డకట్టుకున్నవో...!?
కరడు గట్టిన నీ ఎదను ప్రశ్నించు...!?
ఎన్నెన్ని
పవిత్ర హృదయాలు కరిగి
నదులై ప్రవహించి
ఆ కన్నీటి ప్రవాహాల్ని ప్రక్షాళన గావించాలో...!?
ఇకనైనా గుర్తించు

నేనొక నూతన శకానికి నాంది పలుకబోతున్నా
హింసకు తావు లేని
ఓ ఆధ్యాత్మిక వ్యూహాన్ని
నీ దురహంకారంపై ప్రయోగించబోతున్నా
'లా ఇలాహ ఇల్లల్లాహు
ముహమ్మదుర్రసూలుల్లాహ్‌ా'
కల్మషమైన నీ హృదయానికి
కల్మాయే దివ్యౌషధం
అవును ఇస్తిగ్ఫారే నీకు ఉపశమనం
ఇక, ఈ భూగోళంపై శాంతి పతాకం పచ్చపచ్చగా ఎగురవేయబోతున్నా
రా, నాతో చేయి కలుపు!! ఈ ప్రపంచాన్ని
శాంతితో నింపి, కాంతితో వెల్గిద్దాం
ఆ కాంతి కిరణాలలో
'సూరయె ఫాతెహా'
పఠిద్దాం...రా!

ఇస్తిగ్ఫార్‌: హృదయంలో కరడుగట్టిన కల్మషాన్ని కడిగి స్వచ్ఛత కల్గించే ప్రార్థన.

No comments:

Post a Comment