ముహమ్మద్ ఖాన్ (గన్న వరం)
స్తబ్ధంగా
ఉన్నది ఏదైనా
ప్రాణి ఎలా అనిపించుకుంటుంది?
చలనం, జలమునకైనా అనివార్యం!
చిరు తటాకమునకైనా
చిన్నారి అలల కేరింతలే
చలనం
సరస్సయినా,
నదయినా
అలలే కదా చలనం
కెరటాలు లేని సముద్రం
ఏది?
అది, సమద్రమెలా అనిపించుకుంటుంది?
నిత్యం సంఘర్షణ
తీరంలోనే,
కెరటంలోనే విభేదం
ఏ ఒక్క కెరటమన్నా
మౌనంగా తీరం తాకిందా?
ఏ ఒక్క కెరటమయినా
స్తబ్ధంగా ప్రక్కకు
తప్పుకున్నదా?
మస్తిష్కంలో
ఏదో ఒక ఆలోచన
కెరటమై ఎగసిపడనిదే
అది
మస్తిష్కం ఎలా అనిపించుకుంటుంది?
మస్తిష్కం
మహా సముద్ర ఘోష
కెరటాలు
కోకొల్లలు ఉద్భవించటం
ప్రవహించటం
కొన్ని తీరం తాకకనే
మరుగైపోవటం
మరి కొన్ని
సుడులయి, అల్ప పీడనములయి
అతలాకుతలం చేయటం
సునామీలై విరుచుకు
పడటం
ప్రకృతి వైపరీత్యమై
చెలరేగటం
ఇదేం క్రొత్త కాదు
కదా!
మహా సముద్రముకన్నా
మస్తిష్క సముద్రం
అంతులేనిది
ముకుళించుకుపోయిన
మస్తిష్కానికి ఇది
ఎలా అర్థమవుతుంది?

No comments:
Post a Comment